బంగ్లాదేశ్‌లో మరో అరాచకం చోటు చేసుకుంది. హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీ హిందువులపై దాడులను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా చత్తోగ్రామ్ జైలులో ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్‌ను పరామర్శించడానికి వెళ్లిన ఇస్కాన్ ప్రతినిధి శ్యామ్‌దాస్ ప్రభును బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ చర్యలను ఖండిస్తూ ఇస్కాన్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై జరుగుతోన్న దాడులు వ్యవస్థీకృతమైనవి కావంటూ
ఐక్యరాజ్యసమితిలో ఆదేశ ప్రతినిధి తారిక్ మహ్మద్ అరిపుల్ ఇస్లాం చెప్పారు. ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ చేసిన తప్పు చిన్నది కాదని, సరైన ఆధారాలతో కేసు నమోదైందని, విచారణ జరుగుతోందని ఇస్లాం ఐరాస సమావేశంలో తెలిపారు.
హిందువులపై దాడులను ఆరెస్సెస్ ఖండించింది. హిందువులపై దాడులను ఆపాలంటూ తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు. హిందువుల హక్కులకు భంగం వాటిల్లుతోందని, దేవాలయాల ధ్వంసం ఆపాలంటూ ఆరెస్సెస్ నేతలు డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతోన్న దాడులపై భారత్ స్పందించింది. హిందువులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ విదేశాంగ శాఖ అధికారులు కోరారు.దాడులు ఇలాగే కొనసాగితే ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇస్కాన్ పిలుపు మేరకు 150 దేశాల్లో శాంతియుత నిరసనలు ప్రారంభమయ్యాయి.