ఫెయింజల్ తుఫాను తీరం దాటింది. ఏపీకి తుఫాను ముప్పు తప్పింది.తుఫాను ప్రభావంతో కురుస్తోన్న అతిభారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఫెయింజల్ తుఫాను తమిళనాడులోని పుదుచ్చేరి వద్ద గత రాత్రి తీరం దాటింది. దాని ప్రభావంతో తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నారు. చెన్నై నగరం నీట మునిగింది. రోడ్లు జలమయం అయ్యాయి. రవాణా స్థంభించిపోయింది. తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వరద పోటెత్తడంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు.
తుఫాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేటలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయం అయ్యాయి. తిరుమలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాపవినాశనం వెళ్లే రహదారులను మూసివేశారు. చలి ఒక్కసారిగా పెరిగిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్నా నదికి ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు.
ఫెయింజల్ తుఫాను ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఏపీలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో 2 నుంచి 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. రైతులు పంట నూర్పిడి వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు.