ఛత్తీస్గఢ్లో పోలీసు బలగాలు 13మంది మావోయిస్టులను అరెస్ట్ చేసారు. వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుల్లో ఒకడైన కొస పునెం అలియాస్ హడ్మా కూడా ఉన్నాడు. నిన్న శుక్రవారం నాడు బిజాపూర్ జిల్లాలోని వేర్వేరు ప్రదేశాల్లో ఈ మావోయిస్టులను పట్టుకున్నట్లు పెలీసులు వెల్లడించారు.
హడ్మా సిపిఐ మావోయిస్టు పార్టీ జాగర్గుండ ఏరియా కమిటీ సభ్యుడు. చాలా ఏళ్ళుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని తలపై రూ.2లక్షల రివార్డు ఉంది.
ఈ అరెస్టులు బిజాపూర్ జిల్లాలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు తార్రెం పోలీస్ స్టేషన్ ఏరియాలో పట్టుబడ్డారు. ఐదుగురిని అవపల్లి దగ్గర అదుపులోకి తీసుకున్నారు, మరో ఐదుగురిని జంగ్లా పీఎస్ పరిధిలో అరెస్ట్ చేసారు. వారి దగ్గరనుంచి టిఫిన్ బాంబులు, పేలుడు పదార్ధాలు, డెటొనేటింగ్ కార్డ్లు, మావోయిస్టు ప్రచార సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్లో పలు విభాగాలు పాల్గొన్నాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ఫోర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాల సంయుక్త ఆపరేషన్ ఇది. అరెస్టయిన మావోయిస్టులు 19 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్నారు. వారిలో చాలామంది ఇప్పుడు క్రియాశీలంగా పని చేస్తున్న మావోయిస్టులే.
కొస పునెం అలియాస్ హడ్మా, ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలోని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకడు. భద్రతా బలగాలపై చాలా దాడుల్లో అతను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. జాగర్గుండ ఏరియాలో మావోయిస్టు ప్రాబల్యం పెరగడంలో హడ్మా కీలక పాత్ర పోషించాడు.