భారత జీడీపీ వృద్ధి రేటు మందగించింది. రెండో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. తాజాగా విడుదల చేసిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతానికి పడిపోయింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం తరవాత అతి తక్కువ నమోదు కావడం ఇదే మొదటి సారి. చైనాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతం మాత్రమే. చైనాతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. రెండో త్రైమాసికంలో భారత జీడీపీ 44 లక్షల కోట్లకు చేరింది.
గత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.1 శాతం నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 34 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 6.7 శాతంగా నమోదైంది. రెండో త్రైమాసికంలో తగ్గినా మొత్తం మీద ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వృద్ధి రేటు ఆశాజనకంగానే ఉంటుందని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరాంతానికి 6.5 శాతం నమోదవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి.
రెండో త్రైమాసికంలో వ్యవసాయం, నిర్మాణ, సేవల రంగాలు మంచి పనితీరు కనబరిచాయి. తయారీ, గనులు, సరఫరా, ఇతర సేవల రంగాలు కుదేలయ్యాయి. దీంతో జీడీపీ వృద్ధి క్షీణించింది. వరదలు, అతి భారీ వర్షాలు కూడా గనుల రంగం పనితీరును దెబ్బతీశాయి. రాబోయే 4 నెలల్లో మంచి పనితీరు కనబరుస్తాయని అంచనా వేస్తున్నారు.