తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రోకంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి హంస వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించిన సిరుల తల్లి, శనివారం ఉదయం ముత్యపు పందిరి పై నుంచి దర్శనమిస్తూ కటాక్షించారు. ఆదిలక్ష్మి అలంకారంలో ముతప్యపు పందిరిపై నుంచి ఆదిలక్ష్మి అవతారంలో పద్మావతీ అమ్మవారు విహరించారు.
ముద్దులొలికించే ముత్యాలు అంటే శ్రీవారి దేవేరి అలిమేలుమంగమ్మకు ఎంతో ప్రీతి. స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి ముత్యంగా మారతాయి. ఈ ముత్యాలు ఏనుగుల కుంభ స్థలాల్లో ఉంటాయని అంటారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై విహరించే అమ్మవారిని సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని నమ్ముతారు. సమస్త మానవాళి కల్మషం లేని స్వచ్ఛమైన ముత్యం వలే ప్రకాశించాలని లోకానికి హితబోధ చేయడమే ఈ వాహన సేవ యొక్క పరమార్ధం.
బ్రహ్మోత్సవాల రెండో రోజు రాత్రి శ్రీవారి ప్రియసఖి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు హంస వాహనంపై వీణ చేతబట్టి సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. పాలను, నీటిని వేరు చేయగల విలక్షణ సామర్థ్యం హంస సొంతం. యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి నడుచుకుంటారు. మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ‘హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ’ అని ఆరాధిస్తారు.
వాహన సేవల ముందు కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేటి మధ్యాహ్నం తిరుమంజనం, రాత్రికి సింహవాహనసేవ నిర్వహిస్తారు.