రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతున్నా ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఆధీనంలోని భూమిని నాటోలో చేర్చుకుంటే యుద్ధం విరమిస్తామని ఆయన ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం చేయడంతోపాటు ఖండాంతర క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది. దీంతో ఉక్రెయిన్ సైన్యం చేతులెత్తేసింది. ఇలాంటి పరిస్థితుల్లో యద్ధం ఆపేందుకు ఉన్న అవకాశాన్ని జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
అయితే నాటోలో తమ దేశాన్ని చేర్చుకుంటారా లేదా అనేది తెలియదని, ఉక్రెయిన్ ఆధీనంలోని భూ భాగాన్ని అయినా నాటోలో చేర్చుకుని రష్యా నుంచి రక్షణ కల్పిస్తే యుద్ధం విరమిస్తామని ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని నాటోలో చేర్చుకోకపోవచ్చని కూడా జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు.
రష్యా దూకుడుగా యుద్ధం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌కు అమెరికా క్షిపణులు సమకూర్చినా వాటిని ప్రయోగించే సామర్థ్యం కూడా కీవ్ వద్ద లేకుండా పోయింది. రష్యా క్షిపణులతో భీకరదాడులకు దిగడం, దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థపై దెబ్బ కొట్టడంతో ఉక్రెయిన్ ఆలోచనలో పడింది.
రెండున్నరేళ్ల కిందట ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటి వరకు 7 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా. ఉక్రెయిన్, రష్యా సైనికులతోపాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ముగింపుపై జెలెన్స్కీ చేసిన తాజా ప్రకటన చర్చకు దారితీసింది.