నైరుతి బంగాళాఖాతంలో కదులుతున్న తుపానుకు ‘ఫెంగల్’ అని వాతావరణ శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు. ఈ తుపాను శనివారం తెల్లవారుజాము నుంచీ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని అంచనా వేసారు. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఫెంగల్ తుపాను పుదుచ్చేరికి 150 కి.మీ, చెన్నైకి 140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని శాస్త్రవేత్తలు తెలియజేసారు.
ఫెంగల్ తుపాను ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కరైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతితీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మన రాష్ట్రంలో ఈ తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70-90 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆకస్మిక వరదల విషయంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జాలరులు ఒకట్రెండు రోజులు సముద్రం మీదకు వెళ్ళకుండా ఉంటే మంచిదని సూచించింది.