ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళడం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆ విషయాన్ని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించగా ఇప్పుడు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ సమావేశం రేపటికి వాయిదా పడింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌కు భారత జట్టు వెళ్ళలేదని బీసీసీఐ, ఐసీసీకి వెల్లడించింది. దాంతో ఆ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడం గురించి ఐసీసీ యోచిస్తోంది. దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు.
ఆ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ‘‘బీసీసీఐ ఇప్పటికే ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. పాకిస్తాన్‌లో భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని బీసీసీఐ ఆందోళనగా ఉంది. అందువల్లనే అక్కడికి భారత జట్టును పంపించడం లేదని వివరించింది. ఆ అంశాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. భారత జట్టు పాకిస్తాన్ వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు’’ అని జైస్వాల్ ప్రకటించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఐసీసీ సమావేశం రేపటికి వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగాల్సి ఉన్న ఆ సమావేశం, భారత్ కచ్చితమైన వైఖరి, హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్తాన్ నిరాకరణతో పదిహేను నిమిషాల్లోనే ముగిసిపోయింది.
భారత్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న కారణంగా ఆ దేశంతో క్రీడా సంబంధాలను మన దేశం నిలిపివేసింది. 2008 ఆసియా కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించలేదు. పాక్ జట్టు మాత్రం 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సీరీస్ ఆడింది.