హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేసిన సనాతన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్టు చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, ఇస్కాన్ బ్యాంకు అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ తో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి చెందిన బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను నెలపాటు ఫ్రీజ్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది.
బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇస్కాన్ కు చెందిన 17మంది వ్యక్తులు చేస్తున్న వృత్తి, వ్యాపారాలు,బ్యాంకు ఖాతాల సమాచారం, లావాదేవీల వివరాలు అందజేయాలని కోరింది.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో అక్టోబరు 25న జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్, ఆ దేశ జెండాను అగౌరవపరిచారని కేసు నమోదైంది.ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువుల పై , ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థను, శాంతిభద్రతలను రక్షించడంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
చిట్టగాంగ్‌లో హిందూ దేవాలయంపై దాడి తోపాటు వివిధ ప్రార్థనాలయాలపై జరుగుతున్నదాడులను ఆమె ఖండించినట్లు అవామీ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో మతస్వేచ్ఛను కాపాడటంతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవితాలకు భద్రత కల్పించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ వీడి భారత్ లో ఉంటున్నారు.