మహారాష్ట్రలో ఘోరం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. నేటి మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన బస్సు నాగ్పూర్ నుంచి గోండియాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఖజ్రీ గ్రామ సమీపంలోకి రాగానే బైక్ను తప్పించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయగా అదుపుతప్పి బోల్తా పడింది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు.ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.