వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం అమ్మవారు పెద శేష వాహనంపై దర్శనమిచ్చారు. శుక్రవారం శుభవేళ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు.
లక్ష్మీసహితుడైన శ్రీహరికి సర్పరాజు ఆదిశేషుడు ఎన్నో విదాలుగా సేవలందిస్తాడు.
శేషవాహన సేవను ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈ సేవను వీక్షించడంతో పశుత్వం తొలగి మానవత్వం ఏర్పడుతుంది. దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. పెద్ద శేష వాహనంపై అమ్మవారి దర్శనం సౌభాగ్య దాయకమని భక్తుల విశ్వాసం.రాత్రికి హంస వాహనంపై నుంచి అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు.
తొలి రోజు( గురువారం రాత్రి) శ్రీ పద్మావతి అమ్మవారు మురళి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. పిల్లనగ్రోవి ధరించి చిన్నశేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహన సేవ చిన్న శేష వాహనం. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచానికి సిరులతల్లి రక్షణలో సుఖం దక్కుతుంది. చినశేష వాహనంపై అమ్మవారి దర్శిస్తే యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసిస్తారు.