ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పిందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదని వివరించిందతి. ఈ తీవ్రవాయుగుండం ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడనుంది. గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కిలోమీటర్లు, నాగపట్టణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
శనివారం ఉదయానికి కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 30 నుంచి డిసెంబరు 2 వరకూ కోస్తాంధ్ర అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తీరిక లేకుండా ఉన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పంట రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.