అదానీ విళింజం పోర్ట్‌తో ఒప్పందాన్ని కేరళ ప్రభుత్వం మరో ఐదేళ్ళకు పొడిగించింది. పోర్టు కమిషనింగ్ గడువును డిసెంబర్‌కు పొడిగించింది. ఆ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ప్రాజెక్టు కాలవ్యవధిని మరో ఐదేళ్ళు పొడిగించడానికి అదానీ విళింజం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సప్లిమెంటరీ కన్సెషన్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసినట్లు తెలియజేసారు.
విళింజం పోర్ట్ ప్రాజెక్టు రెండవ, మూడవ దశలు తుదిస్థాయికి చేరాయి. 2028 నాటికి పోర్టు పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. ఆ నేపథ్యంలో ఒప్పందాన్ని పొడిగించారు. ఈ పొడిగింపులో భాగంగా పోర్టు సామర్థ్యం పెంచడానికి రూ.10వేల కోట్ల పెట్టుబడి వస్తుంది.
పోర్టు నిర్మాణం అన్నిదశలూ పూర్తయాక పోర్టు హ్యాండ్లింగ్ సామర్థ్యం 30లక్షల టిఇయులకు చేరుతుంది. దాంతో ఆ ఓడరేవు అంతర్జాతీయ వాణిజ్య నెట్‌వర్క్‌లో కీలక పాత్రధారి అవుతుంది.
విళింజం ఓడరేవు భారతదేశంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ ఓడరేవు. దాని నిర్మాణం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 2016లో మొదలైంది. అత్యాధునిక, అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, భారీ ఓడలను హ్యాండిల్ చేసే సామర్థ్యం దాని సొంతం.