బంగ్లాదేశ్ ఆపద్ధర్మ అధినేత మొహమ్మద్ యూనుస్ రోజురోజుకూ తన హిందూ వ్యతిరేకతను, పాశ్చాత్య ప్రపంచానికి తన విధేయతనూ చాటుకుంటున్నాడు. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి దయనీయం నుంచి దరిద్రానికి దిగజారిపోయింది.
యూనుస్ ముస్లిములకు ఒక నియమం, హిందువులకు ఇంకో నియమం అనుసరిస్తున్నాడు. యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇప్పుడు ఇస్కాన్‌ను మతఛాందస, మతోన్మాద సంస్థగా పరిగణించి, దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో అన్సారుల్లా బంగ్లా టీమ్ (ఎబిటి) సభ్యులు హిందువులపై భౌతిక దాడులకు పాల్పడుతుంటే కిక్కురుమనకుండా ఉంటోంది. ఇస్కాన్ పాల్పడిన ఒక్కటంటే ఒక్క హింసాత్మక చర్యను ఎవ్వరూ చూపించలేరు. కానీ ఎబిటి అనేది పక్కా జిహాదిస్టు గ్రూపు. దాన్ని శాంతిదూతలా భావిస్తోంది యూనుస్ పాలన.
ప్రస్తుత పరిస్థితిలో మనం ఎబిటి గురించి తెలుసుకుని తీరాలి. ఎందుకంటే యూనుస్ గద్దెనెక్కాక రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నాడు. మొదటిది జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేయడం. రెండవది ఎబిటి సంస్థ అధినేత జషీముద్దీన్ రహ్మానీని విడుదల చేయడం.
అల్ ఖైదా మద్దతుదారు, ఒసామా బిన్ లాడెన్ అభిమాని, ఒక బ్లాగర్ హత్య కేసులో శిక్ష పడిన నేరస్తుడు అయిన రహ్మానీని జైలు నుంచి విడుదల చేసారు. ఎబిటి ఉగ్రవాద కార్యకలాపాలతో విసిగిపోయిన భారతదేశం ఆ సంస్థను చాలాకాలం క్రితమే నిషేధించింది. ఇప్పుడు జైలు నుంచి విడుదల చేసిన వెంటనే రహ్మానీ చేసిన మొదటి పని, భారతదేశం మీద హింసాత్మక జిహాద్‌కు పిలుపునివ్వడం. భారత్ నుంచి జమ్మూకశ్మీర్‌ను ‘విముక్తం’ చేయడం కోసం పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ సాయం చేయాలని అతను కోరుతున్నాడు.
ఎబిటి కేవలం ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదు. కిరాయికి హత్యలు, దోపిడీలు సైతం చేసే నికృష్టమైన సంస్థ. ఒక దశలో ఎబిటి, బంగ్లాదేశ్‌లోని నాస్తిక బ్లాగర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండేది. ఆ నేపథ్యంలో ఆ సంస్థను బంగ్లా ప్రభుత్వం నిషేధించింది. జమాతే ఇస్లామీలో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే విద్యార్ధి విభాగం ఛాత్ర శిబిన్‌తో ఎబిటికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎబిటిని రహ్మానీ ఐదేళ్ళ వ్యవధిలో ఉగ్రవాద సంస్థగా అభివృద్ధి చేసాడు. ఆ సంస్థే బంగ్లాదేశ్‌లో ప్రముఖ నాస్తికులను, బ్లాగర్లనూ వెంటాడి వేటాడి హత్య చేసింది. దేశంలో ఇస్లాంను అనుసరించని వారికి బతికే హక్కు అయినా లేదంటూ ప్రజల్లో భయభ్రాంతులను పెంచి పోషించడమే వారి ప్రధాన ఉద్దేశం.
ఎబిటి బంగ్లాదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు. ఆ సంస్థ భారతదేశంలో సైతం సమస్యలు కలగజేసే లక్ష్యంతో పని చేసేది. ఈ యేడాది మే నెలలో ఆ సంస్థ గువాహటిలో ఏర్పాటు చేసిన మోడ్యూల్‌ను భారత్ బట్టబయలు చేసింది. ఆ విచారణలో భాగంగా తెలిసిన విషయమేంటంటే, అల్‌ఖైదాకు భారత ఉపఖండంలో మోడ్యూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నది ఎబిటి సంస్థే. అంతేకాదు, ఎబిటికి పాకిస్తాన్‌కు చెందిన, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ రెండు సంస్థలూ కలిసి 2022లో పశ్చిమబెంగాల్లో మోడ్యూల్స్‌ను ప్రారంభించే లక్ష్యంతో పనిచేసాయి. వారి ప్రధాన లక్ష్యం భారత్‌లోకి అక్రమ వలసలను రానివ్వాలని ప్రచారం చేయడం, తర్వాత మనదేశంలో బాంబుదాడులకు పాల్పడడం.
ఎబిటి సంస్థకు భారత్‌లో ప్రస్తుతం వంద మందికి పైగా కార్యకర్తలు ఉణ్నారు. ఇటీవల త్రిపుర పోలీసులు ఎబిటి జిహాదీలు భారత్‌లోకి చొరబడాలని చేసిన కుట్రను విఫలం చేసారు.
అలాంటి ఎబిటిని గొప్ప సేవాసంస్థ అంటున్నాడు మొహమ్మద్ యూనుస్, రాధాకృష్ణుల పూజాపాఠాల్లో నిరంతరం నిమగ్నమై ఉండే ఇస్కాన్‌ను మతోన్మాద సంస్థ అని వ్యాఖ్యానిస్తున్నాడు. అసలు యూనుస్‌ను తోలుబొమ్మను చేసి నడిపిస్తున్నది వెస్టర్న్ వరల్డ్, పాకిస్తాన్, జమాతే ఇస్లామీ. డీప్ స్టేట్ సలహాల కారణంగానే ఆయన విద్యార్ధి ఆందోళనలను అడ్డం పెట్టుకుని షేక్ హసీనాను పదవీచ్యుతుణ్ణి చేసారు.
ఇప్పుడు యూనుస్ పాకిస్తాన్ రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నాడు. మన శత్రుదేశం ఎప్పుడూ బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని, భారత్ నుంచి విముక్తం చేయాలనీ, దానికి ఇదే సరైన సమయమనీ చెబుతున్నాడు. హిందూ ద్వేషం అడుగడుగునా నింపుకున్న వ్యక్తిగా యూనుస్ మారిపోయాడు. అందుకే ఇప్పుడతని చేష్టల ఫలితం అతనికి తెలియడం లేదు. ఆ క్రమంలోనే ఇస్కాన్ ప్రతినిధిని అరెస్ట్ చేయించాడు, హిందువులపై దాడులను కొనసాగిస్తున్నాడు.