స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒకే రోజు మదుపర్లు రూ.2 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టకముందే ట్రేడ్ వార్ ప్రారంభం కావడంతో మార్కెట్లను భయాందోళనలు చుట్టుముట్టాయి. కెనడా, బ్రెజిల్, మెక్సికో, చైనా దేశాల దిగుమతులపై 10 నుంచి 25 శాతం సుంకాలు వేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసింది.
స్టాక్ సూచీలు భారీత పతనం అయ్యాయి. ఇవాళ ఉదయం 80281 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 1190 పాయింట్లు కోల్పోయి, 78918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా భారీ నష్టాలను నమోదు చేసింది. నిఫ్టీ 360 పాయింట్ల నష్టంతో, 23914 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా, టీసీఎస్, రిలయన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
రూపాయి మరింత బలహీన పడింది. 9 పైసలు కోల్పోయింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 84.49 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరలు దిగి వచ్చాయి. తాజాగా బ్యారెల్ క్రూడాయిల్ 73 డాలర్లకు దిగివచ్చింది. బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 2645 డాలర్లకు చేరింది.