ముంబై పోలీసుల అదుపులో అనుమానితురాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోదీని హత్య చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. అందుకు అవసరమైన ఆయుధం కూడా సిద్ధం చేశామని ఫోన్ లో తెలిపింది. ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళ(34)ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. సదరు మహిళకు నేరచరిత్ర లేదని, ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందనీ వార్తలు వస్తున్నాయి.
గత ఏడాది జులై లో కూడా ముంబై పోలీసులకు ఇదే తరహా బెదిరింపు ఫోన్ వచ్చింది. ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని అప్పట్లో ఫోన్ ద్వారా బెదిరించారు.