శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కార్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య ధనుర్లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అమ్మవారు చిన్న శేషవాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
విష్వక్సేనుడు స్వామి వారి పూజతో ధ్వజారోహణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విఘ్నాలు లేకుండా కార్యాలు జరిగేందుకు సర్వసేనాధిపతి అయిన విష్వక్సేనుడి పూజించడం వైష్ణవ సంప్రదాయం. అనంతరం పుణ్యాహవచనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేందుకే ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు.
వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలకు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. డిసెంబరు 6న జరిగే పంచమీ తీర్థానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
దాదాపు 50 వేల మందికి అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు. వాహనసేవల వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో 20 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశామన్నారు.