ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో ఇది తుఫానుగా మారి శ్రీలంక, దక్షిణ తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేశారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ట్రికోలికి 100 కి.మీ, చెన్నైకు 400 కి.మీ దూరంలో ఉంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణం చేస్తోంది. ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారి , కారైకల్ మహాబలిపురం మధ్య ఫెంగస్ తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
తీవ్రవాయుగుండం ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 13 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో గంటకు 55 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి అధికారులు తెలిపారు.
తీవ్ర వాయుగుండం నవంబరు 28 సాయంత్రానికి తుఫానుగా మారనుంది. దీనికి ఫెంగస్‌గా నామకరణం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గంటకు 16 కి.మీ వేగంలో ప్రయాణం చేస్తోంది.గురువారం సాయంత్రానికి తీరాన్ని తాకి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది.
రైతులు నూర్పిడి పనులు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విపత్తు సంస్థ సిబ్బందిని సిద్దం చేశారు. కోస్తాంధ్రలో ఉరుములతో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదముందని అధికారులు హెచ్చించారు. చెన్నైలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.