తెలుగుదేశం ఎమ్మెల్యే రఘు రామకృష్ణ రాజును గత ప్రభుత్వ హయాంలో హింసించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ అదనపు ఎస్‌పి విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు విజయ్‌పాల్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
ఏపీ పోలీసులు సిఐడి మాజీ అడిషనల్ ఎస్‌పి విజయ్‌పాల్‌ను నిన్న (మంగళవారం) ఉదయం ప్రకాశం జిల్లా ఎస్‌పి ముందు విచారణకు తీసుకువెళ్ళారు. రాత్రి 7 గంటల సమయంలో అరెస్ట్ చేసారు. ఇవాళ ఉదయం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానానికి 11 పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించారు. విజయ్‌పాల్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయవలసి ఉన్నందున రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ 2021లో రఘు రామకృష్ణ రాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్ నుంచి బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రాత్రి కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, హత్యాప్రయత్నం చేసారనీ రఘు రామకృష్ణ రాజు ఈ యేడాది జులై 11న గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేసారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నాటి ఎపి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అదనపు ఎస్‌పి విజయ్‌పాల్ తదితరులపై కేసు నమోదు చేసారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయ్‌పాల్ పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ పిటిషన్‌పై మొన్న సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విజయ్‌పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో నిన్న మంగళవారం విజయ్‌పాల్ విచారణకు హాజరయ్యారు. నిన్న సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు.