ఉత్తరప్రదేశ్ పోలీసులు నవంబర్ 9న గ్రేటర్ నోయిడాలో భారీ మొత్తంలో తరలిస్తున్న బీఫ్‌ను పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్లో ఆవులను అక్రమంగా వధించి గోమాంసాన్ని స్మగుల్ చేస్తున్న నెట్వర్క్ ఆ బీఫ్ రవాణా వెనుక ఉందని తేల్చారు. పశ్చిమ బెంగాల్ నుంచి నోయిడాకు కోల్డ్ స్టోరేజ్ కంటెయినర్లలో బీఫ్ తరలించారు. అక్కడినుంచి ఢిల్లీ, ఉత్తరాఖండ్‌కు పంపించే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు.
మొత్తం 185 టన్నుల బీఫ్‌ను రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలియజేసారు. అయితే గోరక్షా హిందూ దళ్ అధ్యక్షుడు మాత్రం సుమారు 250 టన్నుల గోమాంసాన్ని సీజ్ చేసారని వెల్లడించాడు. ఈ బీఫ్ అక్రమ రవాణా గురించి మేవాత్‌లోని గోరక్షా దళాలే సమాచారమిచ్చాయని ఆయన చెప్పాడు.
లోనీ ప్రాంత బీజేపీ ఎంఎల్ఎ నందకిషోర్ గుర్జర్ అంతకంటె దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడించారు. ఈ బీఫ్ కోసం కనీసం 8వేల ఆవులను నరికివేసారని ఆయన చెప్పారు. గోమాంసం అక్రమ రవాణా వెనుక లక్నోకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
ఈ కేసుకు సంబంధించి 9మంది వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్ట్ చేసారు. గోమాంసాన్ని నిల్వచేసిన కోల్డ్ స్టోరేజ్ కేంద్రాన్ని యూపీ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేయాలంటూ కొంతమంది గోరక్షా దళం కార్యకర్తలు డిమాండ్ చేసారు. ఈ కేసులో పట్టుబడిన నిందితుల మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ సంఘటన నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోరక్షా సంఘటన్ సభ్యులకు బెంగాల్ నుంచి గోమాంసం రవాణా అవుతోందంటూ సమాచారం అందింది. ఆ రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాన్ని వారు గుర్తించారు. హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాన్ని వారు తనిఖీ చేసారు. అందులో నిషేధిత గోమాంసం ఉంది. బైటకు మాత్రం దున్న మాంసం అని రాసి ఉంది. విషయాన్ని వారు పోలీసులకు తెలియజేసారు. పోలీసులు మాంసం నమూనాలను పరీక్షకు పంపించగా అది గోమాంసమేనని నిరూపణ అయింది. పోలీసులు ఆ ట్రక్కు డ్రైవర్, అతని అసిస్టెంట్లను అరెస్ట్ చేసారు. విచారణలో వారు తాము బెంగాల్ నుంచి బీఫ్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ బీఫ్‌ను గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నగ్లా కిరానీ గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్‌కు తీసుకువెడుతున్నట్లు తెలియజేసారు.
గోమాంసం అక్రమ రవాణా ఆపరేషన్‌కు సంబంధించి మరో ఏడుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. దాంతో మొత్తం 9మందిని అరెస్ట్ చేసినట్లయింది. వారిలో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ యజమాని, దాని నిర్వాహకులు కూడా ఉన్నారు.
నోయిడా పోలీసులు మొత్తం 185 టన్నుల బీఫ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. దాని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకువెడతానని బిజెపి ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జర్ చెప్పారు. బీఫ్ స్మగ్లింగ్ వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసారు.