సకాలంలో స్పందించి రక్షించిన రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం, నేవీ
అధికారులను అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు
ప్రతికూల వాతావరణం మధ్య సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను కాపాడి ఒడ్డుకు చేర్చినట్లు తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ వేటకు వెళ్లి సముద్రంలో ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను ప్రభుత్వ యంత్రాంగం కాపాడింది.
నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల తో కూడిన బోటు తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం, వై.టి.కుప్పానికి సముద్రంలో 14 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను కారణంగా తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. దీంతో సాయం కోరుతూ తిరుపతి కలెక్టరేట్ కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన తిరుపతి కలెక్టర్, రాష్ట్రప్రభుత్వంతో మాట్లాడి నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులను రంగంలోకి దించారు. మత్స్యకారులు,బోటును ఒడ్డుకు చేర్చారు. తమను కాపాడిన నేవి సిబ్బంది, కలెక్టర్, రాష్ట్రప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.
మత్స్యకారులను కాపాడిన అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కృష్ణపట్నం మెరైన్ హెడ్ కెప్టెన్ రజత్, ఇతర అధికారులను అభినందించారు.