పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళనకు దిగాయి. తొలుత లోక్‌సభ గంటపాటు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు శాంతించలేదు. దీంతో లోక్‌సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. విపక్ష ఎంపీల నినాదాల మధ్యనే చైర్మన్ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. ‘అదానీ లంచాల’ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం చేపట్టింది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ఇండీ కూటమి ఎంపీలు నినాదాలు చేశారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చగా, జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును పక్కనపెట్టారు.