శ్రీరామ స్వామి జన్మభూమి అయిన అయోధ్య లో వచ్చే ఏడాది జనవరిలో నూతన రామాలయ వార్షికోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అయితే ఈ వేడుకలు పదిరోజులు ముందే జరగనున్నాయి. అయోధ్యలో 2024 జనవరి 22న నూతన రామాలయాన్ని ప్రారంభించి, బాలక్ రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిపారు. అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు బాల రాముడిని దర్శించుకుని తరిస్తున్నారు.
వార్షికోత్సవ వేడుకలు పదిరోజులు ముందు జరగడం వెనుక ఓ కారణం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రామాలయంలో ఎప్పుడు ఏ పండుగ జరుపుకోవాలో నిర్ణయించారు.
ప్రతీ ఏడాది పుష్య శుక్ల ద్వాదశి అంటే కూర్మ ద్వాదశి నాడు అయోధ్య రామాలయ వార్షిక ఉత్సవం జరుపుకోవాలని పండితులు తెలిపారు. 2025లో ఈ తిధి జనవరి 11న వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.
వైకుంఠ ఏకాదశి మరునాడే ద్వాదశి తిథి వస్తుంది. దీనినే కూర్మద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ తిథి నాడు వైష్ణవ క్షేత్రాల్లో చక్రస్నానం ఘట్టం నిర్వహిస్తారు.