బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, సనాతన ధర్మాన్ని బోధించే ఆధ్యాత్మికవేత్తల అక్రమ నిర్బంధాలు, ఆలయాల ధ్వంసంపై భారత ప్రభుత్వం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న యూనస్ ప్రభుత్వ తీరును తూర్పార బట్టింది. హిందూ సంస్థ సమ్మిళిత్ సనాతనీ జోట్ నేత చిన్మయ్ కృష్ణ దాస్ ను బంగ్లాదేశ్ లో అరెస్టు చేయడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పబట్టింది.
చిన్మయ్ దాస్ కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులతో పాటు మైనారిటీలందరికీ బంగ్లాదేశ్ లో శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులకు సూచించింది.
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత నుంచి హిందువులుపై మెజారిటీలుగా ఉన్న ఓ వర్గం దాడులకు తెగబడుతోంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వ్యతిరేకిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై పలుమార్లు ఆక్షేపణ వ్యక్తం చేసింది.
హిందువులపై జరుగుతున్న దాడులు నిలిపివేయాలంటూ చిన్మయ్ కృష్ణ దాస్ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనిపై బంగ్లాదేశ్ లోని పాలకవర్గం, దేశద్రోహం, మత సామరస్యానికి భంగం కలిగించారన్న ఆరోపణలపై చిన్మయ్ దాస్ ను అరెస్టు చేసింది. అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ పలుహిందూ సంఘాలు ఢాకా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపాయి. మరికొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
అక్టోబర్ 30న బంగ్లాదేశ్లో జాతీయ జెండాను చిన్మయ్ దాస్ అవమానించారన్న కారణంతో దేశద్రోహంచట్టం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 19 మందిపై కేసులు పెట్టారు. ఇద్దరిని అరెస్ట్ సైతం చేశారు.
హిందువుల రక్షణ కోరుతూ సనాతన్ జాగరణ్ మంచ్ ఆధ్యర్యంలో చిట్టగాంగ్లోని లాల్దిఘి మైదానంలో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో ఉన్న ఆజాదీ స్తంభంపై కొందరు వ్యక్తులు కాషాయ జెండాలు ఎగుర వేశారు. దీంతో జాతీయ జెండాను అవమానించారంటూ బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
రిజర్వేషన్ల అమలును వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రం కావడంతో ఆగస్టులో అప్పటి ప్రధాని షేక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. హసీనా ప్రధాని పదవిని వదిలివేయడంతో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక సర్కారు పాలకవర్గంగా ఏర్పడింది.