నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడిందని తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందిందనీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ దూరంలో, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం ఆ తీవ్రవాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తుపానుగా మారే అవకాశం ఉంది. తర్వాత రెండు రోజుల్లో శ్రీలంక తీరం దాటి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్ళే అవకాశం ఉంది.
ఆ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో నవంబర్ 26, అంటే ఇవాళ్టి నుంచీ 29 వరకు అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాబోయే 24 గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో… వచ్చే రెండు రోజుల్లో చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో… ఒకమోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చు. అలాగే ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకమోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది.
ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. రైతులు వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నవంబర్ 27, అంటే రేపటి నుంచీ 29 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని రేవుల్లో అధికారులు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేసారు.