రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఒడిషా, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
డిసెంబరు 3న నోటిఫికేషన్, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణ గడువును ఈసీ అవకాశం కల్పించింది. డిసెంబరు 20న 9 గంటల నుంచి ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఈసీ ప్రకటించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. వారిలో ఇద్దరు టీడీపీలో చేరారు. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ సహా తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఏపీ నుంచి మూడు ఖాళీలు ఏర్పడ్డాయి.
ఏపీ అసెంబ్లీలో కూటమి 175 స్థానాల్లో 164 గెలుచుకుంది. వైసీపీకి కేవలం 11 స్థానాలు దక్కాయి. కనీసం ఒక్క రాజ్యసభ సీటు గెలవాలన్నా కనీసం అసెంబ్లీలో 25 మంది సభ్యుల బలం ఉండాలి. వైసీపీకి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండటంతో బరిలో దిగే అవకాశం లేదు.