అదానీ గ్రూప్ కీలక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో రుణాలు పొందేందుకు భారత్‌లో రూ.2029 కోట్లు లంచాలు ఇచ్చి సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. విదేశాల నుంచి రుణాలు పొందాల్సిన పరిస్థితి లేదన్నారు. కంపెనీ వృద్ధికి అవసరమైనన్ని నగదు నిల్వలున్నాయని ప్రకటించారు.
అదానీ గ్రూప్ కంపెనీల వద్ద 55024 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. 28 నెలల పాటు రుణాలు చెల్లించడానికి ఈ మొత్తం సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు గుర్తుచేశారు. గడచిన ఆరు నెలల్లో కంపెనీ 75 వేల కోట్లు పైగా పెట్టుబడులు పెట్టగా అప్పు పెరిగింది కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమేనని ప్రకటించింది. 12 నెలల కాలంలో కంపెనీ లాభాలు 59 వేల కోట్లుగా ఉంది. రాబోయే పదేళ్లలో కంపెనీ 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది.
ఇప్పటి వరకు అదానీ కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.94400 కోట్లు కాగా, కంపెనీ వద్ద రూ.55 వేల కోట్లకుపైగా నగదు నిల్వలున్నాయి. మొత్తం అప్పుల్లో విదేశీ అప్పులు కేవలం 27 శాతం మాత్రమే. అప్పులు ఆస్తుల నిష్పత్తి 2.7 రెట్లు మెరుగుపడినట్లు కంపెనీ ప్రకటించింది.