పాకిస్థాన్ రక్తసిక్తమైంది. మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్షాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలంటూ ఆ పార్టీ నిరసనలకు పిలుపు నిచ్చింది. దీంతో వేలాది మంది ఇస్లామాబాద్ చేరుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేసే వరకు వెనుతిరిగేది లేదని ఆయన భార్య బుష్రా బీబీ హెచ్చరించారు. బుష్రా బీబీ పిలుపు మేరకు వేలాది మంది సోమవారం ఇస్లామాబాద్ చేరుకున్నారు. భద్రతా దళాలు, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను చీల్చుకుంటూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. 22 పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 119 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
గతంలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘించారనే కేసులు నమోదయ్యాయి. దీనిపై ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. ఆ తరవాత అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ప్రభుత్వం జైల్లో పెట్టింది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కీలక ప్రాంతం డీ చౌక్ వద్ద నిరసనలకు రావాలంటూ పీటీఐ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో ఇస్లామాబాద్ రావల్పిండి జాతీయ రహదారిపై పోలీసులు బారికేడ్లు పెట్టి నిరసనకారులను అడ్డుకుంటున్నారు. బారికేడ్లను తోసుకుంటూ నిరసనకారులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోనూ నిరసనలు మిన్నంటాయి.