తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఇటీవల ప్రకటించిన రూ 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రాజకీయ విమర్శలకు దారితీసింది. ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలవడానికి సోమవారం బయల్దేరేముందు రేవంత్ ఆ ప్రకటన చేశారు.
అదానీ గ్రూప్ కొన్ని రాష్ట్రాలకు ముడుపులు చెల్లించి సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తనకు ముందుగా తెలియదని, అమెరికా కోర్టులో ఆరోపణలు నమోదైనందున ఆ విరాళాన్ని తీసుకోవడం లేదని రేవంత్ వెల్లడించారు. రాజ్యాంగబద్ధమైన పెట్టుబడులను మాత్రం అనుమతిస్తామన్నారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రభుత్వ ప్రాజెక్టులు ఇస్తున్నామని తెలియజేసారు. దేశంలో ఎవరికైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొనే హక్కు ఉందని గుర్తు చేసారు.
“18.10.2024 నాటి మీ లేఖ ద్వారా అదానీ ఫౌండేషన్ తరపున యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. విరాళంపై ఐటి మినహాయింపు పొందనందున నిధుల బదిలీ కోసం మేము ఇప్పటివరకు దాతలలో ఎవరినీ అడగలేదు. ఆ ఉత్తర్వులు ఇటీవలే వచ్చినా, ప్రస్తుత పరిస్థితులు, తలెత్తుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని నిధులు బదిలీ చేయవద్దని కోరాలని ముఖ్యమంత్రి ఆదేశించారు” అంటూ, జయేష్ రంజన్ అదానీ గ్రూప్‌కు లేఖ రాసారు.
ఎవరికి భయపడి విరాళాన్ని వాపస్ చేశారో రేవంత్‌రెడ్డి చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఒప్పందం చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు భయపడలేదు? చెక్ వాపస్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వనని చెప్పాడా? అంటూ ఎద్దేవా చేశారు. అదానీతో దావోస్‌లో చేసుకున్న రూ.12వేల కోట్ల ప్రాజెక్టును కూడా రద్దు చేస్తున్నారా అని నిలదీసారు.
బిఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ఘాటుగా స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు విరాళాన్ని వెనక్కి ఇచ్చేసారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ స్పందించి, జేపీసీ డిమాండ్ చేస్తున్న వేళ, తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.