ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. నవంబరు 27 నాటికి ఇది తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం చెన్నైకు 920 కి.మీ, నాగపట్నంకు 719 కి.మీ దూరంలో ఉంది. ఈ వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణించి చెన్నై, శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేశారు.
వాయుగుండం ప్రభావంతో నవంబరు 27,28,29 తేదీల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో 29న దీని ప్రభావం చూపుతుందని అంచనా. వాయుగుండం ప్రభావంతో 29న ఉత్తరకోస్తాలోనూ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే చెన్నై ఓడ రేవులో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. జాతీయ విపత్తు సంస్థ సిబ్బందిని సిద్దం చేసింది. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని ఐఎండి తెలిపింది.
వాయుగుండం తుఫానుగా మారే ప్రమాదం ఉండటంతో ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దైంది. పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్,విశాఖలో రైల్వే డివిజన్లకు ప్రధాని మోదీ వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ప్రధాని విశాఖ పర్యటన రద్దు కావడంతో ఆంధ్రా యూనివర్సీటీలో ఏర్పాటు చేయతలపెట్టిన సభ రద్దైంది.