కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీవినీ యెరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మైనర్ ఇరిగేషన్ విభాగంలోనే కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన రూ.2500 కోట్ల బిల్లులు పెండింగ్లో పడిపోయాయి. నీటి నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల బిల్లులన్నీ బకాయి పడిపోయాయి. అత్యవసర మరమ్మతు పనుల కోసం జిల్లా విపత్తు నిర్వహణ నిధులను దారిమళ్ళించాల్సిన దుస్థితి నెలకొంది.
ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పెండింగ్ బిల్లులనే చెల్లించలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుండడాన్ని తప్పుపడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల అత్యవసర మరమ్మతులకు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ సొమ్ములను వాడేస్తోంది. దానివల్ల దీర్ఘకాలిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బిల్లులు చెల్లించలేక, ఇతర విభాగాల నిధులపై కన్ను:
కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించలేని ప్రభుత్వ దుస్థితి రాష్ట్ర ఆర్థిక వైపరీత్యాన్ని బహిర్గతం చేస్తోంది. కనీస ఆర్థిక చెల్లింపులైనా చేయలేని పరిస్థితిలోకి ప్రభుత్వం దిగజారిపోయింది. దాంతో మరమ్మతులు, నిర్వహణ ఖర్చులకు నిధుల కోసం ఇతర విభాగాల సొమ్ములను వాడేస్తోంది. ఇప్పటికే చిక్కుల్లో ఉన్న ఖజానా మీద ఇది మరింత ఒత్తిడి పెంచుతోంది.
2024-25 బడ్జెట్లో కర్ణాటక ప్రభుత్వం రూ.200 కోట్ల అంచనా వ్యయంతో 115 ప్రాజెక్టులు చేపడతామని ప్రకటించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, మైనర్ ఇరిగేషన్ విభాగంలో జరుగుతున్న పనులను సమీక్షించి, వాటిలో ప్రధానమైన వాటికి మాత్రమే కొద్దిపాటి నిధులు కేటాయించాలని ఆదేశించింది. అంటే, అదనపు ప్రాజెక్టులకు పైసా కూడా రాలదని స్పష్టం చేసేసింది.
కొత్త ప్రాజెక్టులను తిరస్కరించిన ఆర్థిక విభాగం:
కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పదేపదే తిరస్కరిస్తూ వస్తోంది. 2024 సంవత్సరం మొత్తంలో, మైనర్ ఇరిగేషన్ శాఖకు ఆర్థిక విభాగం పలుమార్లు లేఖలు రాసింది. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చాలాఎక్కువ ఉన్నందున కొత్త ప్రతిపాదనలు పంపించవద్దని వాటి సారాంశం. ఇప్పటికే మొదలుపెట్టిన, పనులు జరుగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాలని సూచించింది. ఆ మేరకు 2024 మార్చి నుంచి నవంబర్ మధ్యలో పదుల సంఖ్యలో ఉత్తరాలు రాసింది. అంతలా ఆర్థికశాఖ హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం కొత్తకొత్త ప్రతిపాదనలు చేస్తూనే ఉంది. కొత్త బ్రిడ్జిలు, బ్యారేజీలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భారీ మొత్తాలతో ప్రతిపాదనలు పెడుతూనే ఉంది.
2024-25 బడ్జెట్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తుంగభద్రా నది మీద బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం చేస్తామని ప్రకటించింది. దానికి రూ.397.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇలాంటివి ఎన్నో ప్రాజెక్టులను ఆ బడ్జెట్లో ప్రకటించేసింది. ఆ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపించేసింది. దాంతో ఆగస్టు 8న ఆర్థిక శాఖ మైనర్ ఇరిగేషన్ శాఖకు లేఖ పంపించింది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు వేటికీ ఒక్క పైసా ఐనా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 24న రాసిన మరో లేఖలో, ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు పూర్తి చేసి, పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేవరకూ కొత్త పనులు చేపట్టవద్దని కుండ బద్దలు కొట్టేసింది. అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కూడా అదే విషయాన్ని వెల్లడిస్తూ మైనర్ ఇరిగేషన్ శాఖకు ఆర్థిక శాఖ లేఖలు పంపించింది.
ఆర్థిక నిర్వహణలో తప్పులు, ఖజానాపై ప్రభావం:
సిద్దరామయ్య ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో తప్పులు రాష్ట్ర ఖజానా మీద భారం పెంచుతున్నాయి. ప్రజలకు బోలెడన్ని వాగ్దానాలు చేసేసారు, కానీ ఆ ప్రాజెక్టుల్లో ఒక్కదాన్నయినా కనీసం ప్రారంభించడానికి కూడా పైసా లేదు. ఆర్థిక నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వపు బాధ్యతారాహిత్యం ఆ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకాల అమలులోనే స్పష్టమైంది. ఆ పథకాలు రాష్ట్ర ఖజానామీద మోపలేని భారమై కూచున్నాయి. నగదు వచ్చే మార్గాలేవీ లేకపోయినా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలూ ప్రకటించడం మాత్రం మానలేదు. దాంతో రాష్ట్రప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి దిగజారిపోయింది.
ఆర్థిక బాధ్యతారాహిత్యం ఆరోపణలు, జవాబుదారీతనానికి పిలుపు:
కాంగ్రెస్ ప్రభుత్వపు ఆర్థిక విధానాలపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి మరికొద్దికాలం కొనసాగితే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని హెచ్చరిస్తోంది. ఈ ఆర్థిక వైఫల్యాల వల్ల తాగునీరు, సాగునీరు వంటి నిత్యావసర సేవలు సైతం నిలిచిపోయే ప్రమాదం వాటిల్లవచ్చునని ఆందోళన కలుగుతోంది. కాంట్రాక్టర్లతో ప్రభుత్వ వ్యవహారాలు పారదర్శకంగా లేవని, ఖజానా లోటును కప్పిపుచ్చుకోడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చెల్లింపుల్లో జాప్యం చేస్తోందనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముదురుతున్న ఆర్థిక సంక్షోభం:
ఒక్క మైనర్ ఇరిగేషన్ శాఖలోనే రూ.2500 కోట్ల బిల్లులు బకాయి పడిఉండగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ సర్కారు దగ్గర ఎలాంటి స్పష్టమైన ప్రణాళికా లేదు. ఉన్న ప్రాజెక్టుల్లో ప్రధానమైన వాటిని గుర్తించి, వాటిని మాత్రమే కొనసాగించాలన్న ఆర్థికశాఖ సూచనను ప్రభుత్వం తిరస్కరించింది. అసలు నిధులే లేకుండా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం ఆర్థికంగా గుదిబండ అవుతుందని ఆ శాఖ ఆందోళన చెందుతోంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం కంటె జరుగుతున్న పనులను పూర్తి చేయడం, కొన్ని బిల్లులు తీర్చడం వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.