ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో జరిగిన హింసపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్తోపాటు వందలాది మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. బార్క్, సోహైల్ లు స్థానికులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించినట్లు జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా, సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ ఆరోపించారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
గతంలో ఆలయం ఉన్న స్థలంలో మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు నిర్మించారని ఓ వ్యక్తి స్థానిక కోర్డును ఆశ్రయించాడు. దీంతో సర్వే చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలు మేరకు అధికారులు మంగళవారం సర్వే చేయగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసింది.
మసీదు వద్దకు చేరుకున్న సర్వే బృందాన్ని వేలాది మంది స్థానికులు అడ్డుకుని రాళ్ళు రువ్వారు. వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేశారు. ఈ హింసలో నలుగురు వ్యక్తులు మరణించగా 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు.