రైలు పట్టాల మీదకు ఇనప రాడ్ విసిరిన వ్యక్తిని ముంబై రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు. 20ఏళ్ళ అబ్దుల్ కదిర్ సమతబ్రేజ్ షేక్ అనే వ్యక్తిని గవర్నమెంట్ రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. అబ్దుల్ నవంబర్ 21 రాత్రి రైల్వేట్రాక్ మీదకు పొడవైన ఇనప రాడ్ విసిరాడు.
గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో గోరేగావ్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ వెడుతున్న లోకల్ ట్రైన్ శాంటాక్రజ్-ఖర్ రోడ్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఆ సంఘటన జరిగింది.
అబ్దుల్ 15 అడుగుల పొడవైన ఇనప రాడ్‌ను దొంగతనం చేసాడు. డ్రగ్స్ కోసం దాన్ని అమ్మివేయాలని ముందు అనుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆ ఇనప రాడ్‌ను రైల్వేట్రాక్ మీదకు విసిరేసాడు. అదృష్టవశాత్తు రైలుకు భారీ ప్రమాదం తప్పడం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు.
అబ్దుల్ ముంబైలోని ఖర్ వెస్ట్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. రైల్వే పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి, పట్టాల మీద ఇనప రాడ్ విసిరేసింది అతనేనని నిర్ధారించుకున్నాక అరెస్ట్ చేసారు. అబ్దుల్ షేక్ మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసారు.