యూదుల మతగురువు జ్వి కోగన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హత్యకు గురయ్యాడు. గురువారం నుంచీ కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం ఆదివారం దొరికింది. ఆ హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు యుఎఇ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్ కోగన్ కుటుంబానికి, యూదులకు సంతాపం ప్రకటించింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, కోగన్ హత్యను తీవ్రంగా ఖండించారు. ‘యూదులకు వ్యతిరేకంగా పాల్పడిన నీచమైన ఉగ్రవాద చర్య’గా అభివర్ణించారు. కోగన్ హత్యకు పాల్పడిన నేరస్తులను శిక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని ప్రకటించారు.
యూదుల మతగురువు హత్య శాంతి, సహనం, సహజీవన విధానాలకు వ్యతిరేకంగా పాల్పడిన నేరమని అమెరికా వ్యాఖ్యానించింది. హింసాత్మక అతివాదంపై యుఎఇ వైఖరి మీద జరిగిన దాడి అని పేర్కొంది. యుఎఇ, ఇజ్రాయెల్ అధికారులకు సాయం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.
28ఏళ్ళ కోగన్ అబుదాబీలో యూదు మతగురువుగా పనిచేస్తున్నారు. దానితో పాటు ఒక యూదు ఆహార పదార్ధాల దుకాణాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆయన భార్య అమెరికా జాతీయురాలు. కోగన్ శవం దొరికిన నేపథ్యంలో యుఎఇకి ప్రయాణించవద్దంటూ ఇజ్రాయెల్ తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.
కోగన్ హంతకులు ఉజ్బెక్ జాతికి చెందినవారని, ఇరాన్ తరఫున పనిచేస్తూ టర్కీ నుంచి యుఎఇ చేరుకున్నారనీ సమాచారం. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెలీలపై దాడులు చేసిన నాటినుంచీ యూదులు, ఇజ్రాయెలీలు లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులు పెరిగిపోయాయి. అప్పటినుంచీ మధ్యప్రాచ్య దేశాలకు ప్రయాణించే తమ దేశస్తులను ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది.