సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలంటూ వేసిన పిటిషన్ను కొట్టివేసింది.రాజ్యాంగం ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి, తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తి చేసిన ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం పిటిషన్లు కొట్టివేసింది.
పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకుండానే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలను చేర్చారని ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి వాదనలు వినిపించారు. పార్లమెంటులో చర్చ జరగకుండా చేసిన రాజ్యాంగ సవరణలకు చట్టబద్దత లేదని వారు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది.
లౌకిక, సామ్యవాద పదాలను రకరకాలుగా అన్వయించుకుంటున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సామ్యవాద అంటే అందరికీ సమాన అవకాశాలుంటాయని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.ఇది సమానత్వాన్ని తెలియజేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీన్ని వేరే అర్థంలో చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. లౌకిక అనేది కూడా అంతేనని కోర్టు తీర్పులో పేర్కొంది.