బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. రోహిత్ శర్మ గైర్హాజరీతో బుమ్రా ఈ మ్యాచ్ కు నాయకత్వం వహించాడు. ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్‌నైట్ స్కోర్ 12/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్, 17 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. ఉస్మాన్ ఖావాజా( 4) పెవిలియన్ చేరడంతో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ద్వయం కొద్దిసేపు భారత బౌలర్లను ఎదుర్కొన్నారు .ఐదో వికెట్‌కు ఈ జోడి 62 పరుగులు సాధించారు. అయితే మహ్మద్ సిరాజ్ ఓ అద్భుతమైన బంతితో స్మిత్(17)ను ఔట్ చేశాడు. దూకుడుగా ఆడి 89 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న ట్రావెస్ హెడ్‌ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మిచెల్ మార్ష్ (47), మిచెల్ స్టార్క్ (12) వికెట్లను కోల్పోవడంతో ఆసీస్ ఓటమి ఖరారైంది. ఆసీస్ జట్టు 58.4 ఓవర్లలో 238 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా , సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్ పడగొట్టారు.