మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ అగ్రనేతలకు తీరని అవమానాన్ని మిగిల్చింది. ప్రతిపక్ష కూటమిలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)లో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మరాఠనేలపై ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 103 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 16 సీట్లలోనే విజయం సాధించింది. సకోలీ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే 208 ఓట్ల తేడాతో గట్టెక్కారు. కానీ, పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
గతంలో ఎంపీగా పనిచేసిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది.
సీట్ల పంపకం విషయంలో శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్), కాంగ్రెస్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. పటోలే పై థాకరే టీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్నికల ఫలితాలకు రెండ్రోజుల ముందు కూడా నానా పటోలే మాట్లాడుతూ, కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. దీనిని సంజయ్ రౌత్ తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల్లో 44 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి 16 స్థానాలకు పరిమితమైంది. దీంతో నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.