పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభాండారం మరమ్మతు పనులు ఈ వారంలో మొదలుపెడతామని, జనవరి 31 నాటికల్లా పూర్తి చేస్తామనీ ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు.
ఆదివారం భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడుతూ, ‘‘పురావస్తు సర్వేక్షణ విభాగం ఎఎస్ఐ అధికారులు రత్నభాండారం మరమ్మతులు, పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభిస్తారు. ఈ మరమ్మతుల కార్యక్రమం, ఆభరణాల ఆడిట్ అన్నీ జనవరి 31లోగా పూర్తి చేయాలని భావిస్తున్నాం’’ అని చెప్పారు.
పనులు ఎప్పుడు ఎలా చేయాలన్న షెడ్యూలును ఎఎస్ఐ రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన చెప్పారు. ఆ పనులు చేపట్టడానికి అవసరమైన అనుమతులను ఎఎస్ఐకి శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మంజూరు చేసిందని వివరించారు.
12వ శతాబ్దానికి చెందిన ఆ ఆలయ రత్నభాండార పునరుద్ధరణ పనులు పూర్తయాక జగన్నాథస్వామి ఆభరణాలను తాత్కాలిక స్థావరం నుంచి మళ్ళీ రత్నభాండారానికి తరలిస్తారు. అప్పుడు మళ్ళీ పటిష్ట భద్రత నడుమ ఆభరణాల ఆడిట్ చేపడతారని మంత్రి తెలియజేసారు.
మరోవైపు, రత్నభాండారం లోపల నేలమాళిగలు ఉన్నాయన్న పుకార్లు నిరాధారమని తేలిపోయింది. గ్రౌండ్ పినట్రేటింగ్ రాడార్, జిపిఎస్ సర్వే రత్నభాండారం లోపల రహస్య మాళిగలు ఏమీ లేవని ధ్రువీకరించింది. ఇకపై నిర్మాణానికి మరమ్మతుల మీద దృష్టి సారిస్తామని ఎఎస్ఐ సూపరింటెండెంట్ డిబి గడ్నాయక్ చెప్పారు. ‘‘రత్న భాండారంలో రహస్య గదులేవీ లేవు. కొన్నిచోట్ల పగుళ్ళు ఉన్నట్లు గుర్తించాం. వాటికి మరమ్మతులు చేస్తాం’’ అని చెప్పారు.
రత్నభాండారానికి చేయవలసిన మరమ్మతుల గురించి టెక్నికల్ ఇనస్పెక్షన్ పూర్తయింది. ఆ నివేదిక ఆలయ నిర్వాహకులకు శనివారం మధ్యాహ్నం ఇ-మెయిల్ ద్వారా అందించారు. 45పేజీల ఆ నివేదికను అధ్యయనం చేసిన ఆలయ నిర్వాహకులు రిపేర్లకు అనుమతిస్తూ ఎఎస్ఐకి లేఖ పంపించారు. ఆలయంలో సంప్రదాయ పూజా కైంకర్యాలకు, భక్తులకు జగన్నాథస్వామి దర్శనానికీ ఎలాంటి అడ్డంకులూ కలగకుండా జాగ్రత్తగా మరమ్మతులు జరుగుతాయని ఆలయ ప్రధాన నిర్వాహకులు డాక్టర్ అరవింద్ పధీ మీడియాకు చెప్పారు.