పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తూన్వా ప్రొవిన్స్‌లో తెగల షియా-సున్నీ తెగల మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో కనీసం 37మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30మందికి పైగా గాయపడ్డారని పోలీసులు శనివారం నాడు వెల్లడించారు.
అప్ఘానిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ పఖ్తూన్వా ప్రొవిన్స్‌లోని కుర్రం జిల్లాలో అలీజయ్, బగన్ తెగల మధ్య ఘర్షణలు సర్వసాధారణం. గత గురువారం నాడు పరాచినార్ ప్రాంతంలో కొన్న వ్యాన్ల మీద దాడి జరిగింది. ఆ ఘటనలో కనీసం 50మంది చనిపోయారని అనధికారిక అంచనా. ఆ వాహన శ్రేణిలో సుమారు 200 వాహనాలు ఉన్నాయి. వాటిమీద సాయుధులు నాలుగు వైపులా ఉన్న కొండలపైనుంచి కాల్పులకు పాల్పడ్డారు.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధికారంలో ఉన్న ఏకైక ప్రొవిన్స్ ఖైబర్ పఖ్తూన్వా. దానికి ముఖ్యమంత్రి అమన్ అలీ గండాపూర్, ఇమ్రాన్‌ఖాన్‌కు వీరవిధేయుడు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన షెబాజ్ షరీఫ్‌కు చెందిన పిఎంఎల్-ఎన్ పార్టీ కార్యకర్తలు, ఖైబర్ పఖ్తూన్వా ప్రొవిన్స్‌లో హింసాకాండకు ఇమ్రాన్‌ఖానే బాధ్యుడని ఆరోపిస్తున్నారు. స్థానిక ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో ఇమ్రాన్ ఖాన్ మెత్తగా వ్యవహరిస్తున్నాడని వారి ఆరోపణ. టిటిపితో ఇమ్రాన్‌ఖాన్ శాంతి ప్రయత్నాల కారణంగా ఆ ఉగ్రవాద సంస్థ రెచ్చిపోతోందని, దానివల్లే వారి హింసకు అంతూపొంతూ లేకుండా పోతోందనీ పిఎంఎల్-ఎన్ పార్టీ ఆరోపిస్తోంది.
గురువారం నాటి సంఘటనా స్థలానికి పోలీసులు, ఉన్నతాధికారులు హెలికాప్టర్లో చేరుకున్నారు. ఇరుపక్షాల మధ్యా శాంతి నెలకొల్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆనాటి దాడిలో కనీసం 37మంది మరణించారని అధికారులు శనివారం నాడు పెషావర్‌లో ఓ మీడియా సమావేశంలో ప్రకటించారు. భారీ, ఆటోమేటిక్ తుపాకులతో ఇరు తెగలూ కాల్పులకు తెగబడుతున్నాయని వెల్లడించారు. తెగల మధ్య ఘర్షణలతో ఆ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
శనివారం నాడు జిల్లాలోని విద్యాసంస్థలను మూసివేసారు. ఒక గ్రామంలోని ఆరుగురు మహిళలను నిర్బంధించి ఎత్తుకుపోయారు. ఆ ప్రాంతంలోని జాతీయరహదారులను మూసివేసారు. నిజానికి ఆ ప్రాంతంలో రహదారులు, సమాచార వ్యవస్థలు సరిగ్గా లేనందున పూర్తిస్థాయి సమాచారం అధికారులకు సైతం అందడం లేదు. ప్రభుత్వ అధికార వర్గాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. రెండు తెగల నాయకులూ ఏమాత్రం తగ్గకపోతుండడంతో దాడుల తీవ్రత పెరుగుతూనే ఉంది.
కుర్రం జిల్లాలో సెప్టెంబర్ నెలలో షియా, సున్నీ తెగల మధ్య ఒక భూ వివాదంలో భాగంగా ఎనిమిది రోజుల పాటు అల్లర్లు జరిగాయి. ఆ సంఘటనలో 50మందికి పైగా చనిపోయారు, 120 మందికి పైగా గాయపడ్డారు. ఇరు తెగల మధ్యా ఘర్షణలతో రహదారులు సైతం మూసివేసారు. ప్రధాన జాతీయ రహదారిని తెరవాలంటూ నవంబర్ నెల మొదట్లో సుమారు లక్ష మంది ప్రజలు శాంతిర్యాలీ నిర్వహించారు.