వీధి కుక్కల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలను హడలెత్తిస్తున్న వీధి శునకాల కట్టడికి చర్యలు తీసుకుంటోంది. కుక్కల సంఖ్యను అదుపు చేసేందుకు గర్భధారణ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించడంతో అందుకు తగిన ప్రణాళికలూ సిద్ధం చేస్తోంది.
కుక్కల దాడిలో రాష్ట్రంలో ఏటా 2 లక్షల మంది గాయపడుతున్నారు. వీరిలో చిన్నారులే ఎక్కువ మంది బాధితులు. ఉద్దేశపూర్వకంగా కుక్కలను చంపడం నేరం కాబట్టి జంతు నియంత్రణ నిబంధనలు-2023 ప్రకారం చర్యలకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. వాటి సంఖ్య నియంత్రణకు సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలి. యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ వేయాలి.
2014-2019 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు కొన్ని జిల్లాల్లో సంరక్షణ గృహాలూ నిర్వహించింది. అనంతపురం జిల్లాలో కుక్కలకు వసతి గృహం కూడా ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో బిల్లులు చెల్లించని కారణంగా శస్త్రచికిత్సలపై పట్టణ స్థానిక సంస్థలు ఆసక్తి కనబరచలేదు.
2022లో దేశంలో అత్యధికంగా కుక్కకాట్లు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండగా, 3,46,318 కేసులతో మహారాష్ట్ర, 3,30,264 కేసులతో తమిళనాడు మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత 1,69,378 కేసులతో ఏపీ మూడో స్థానంలో ఉంది.
ఏపీలో కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో కుక్కల బెడద అత్యంత తీవ్రంగా ఉంది. గత తొమ్మిది నెలల్లో ఒక్కో జిల్లాలో 5 నుంచి 6 వేల కేసులు నమోదు అయ్యాయి.
రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో వచ్చే ఏడాది మార్చిలోగా 2,01,213 వీధి కుక్కల గర్భనియంత్రణ శస్త్ర చికిత్సలతోపాటు వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు. నగరాలు, పట్టణాల్లో 4,33,751 వీధి శునకాలు ఉండగా 2,32,538 కుక్కలకు ఆపరేషన్లు, వ్యాక్సినేషన్ చేసినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.