బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ నాలుగో రోజు ఆట కీలకంగా మారింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన తర్వాత రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఆ తర్వాత నిలదొక్కుకుంది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ద్వయం భారత బౌలర్లను తెలివిగా ఎదుర్కొంటూ లక్ష్య ఛేదనకు శ్రమిస్తున్నారు.
ఆసీస్ లక్ష్యం 534 పరుగులు కాగా మూడోరోజు ఆటలో మూడు వికెట్లు నష్టపోయి 12 పరుగులు చేసింది. నాలుగో రోజు క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ వెంటనే పెవిలియన్ చేరారు. సిరాజ్ వేసిన 5.3 బంతికి ఉస్మాన్ ఖవాజా క్యాచ్ ఔట్ గా దొరికిపోయాడు. దీంతో ఆసీస్ 17 పరుగులు వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. దీంతో క్రీజులోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు.
స్టీవ్ స్మిత్( 17) ను కూడా సిరాజ్ ఔట్ చేయడంతో 79 పరుగులకే ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నారు. 38 ఓవర్లు ముగిసే ఆసీస్ ఐదు వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(89*), మిచెల్ మార్ష్ (31*) ఉన్నారు.