భక్తులతో శబరిమల ప్రాంతం కిటకిటలాడుతోంది. ‘‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’’ శరణగోషతో మార్మోగుతోంది. మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామివారిని దర్శించుకుని ఇరుముడి సమర్పిస్తున్నారు. దీక్ష విరమించిన తర్వాత సమీపంలో ఇతర ఆలయాలను సందర్శిస్తున్నారు. తెలుగు ప్రాంతాలకు చెందిన వారు గురువాయూర్ లోని శ్రీకృష్ణ స్వామిని దర్శించి తరిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు క్యూకట్టారు.
నవంబర్ 16న ఆలయాన్ని తెరవగా, తొమ్మిది రోజుల్లోనే 6,12,290 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని తరించారు. గత ఏడాది ఇదే వ్యవధిలో కేవలం 3,03,501 మంది మాత్రమే దర్శించుకున్నట్లు దేవస్థానం పాలకమండలి వెల్లడించింది. పోలీసుల ముందస్తు చర్యల కారణంగా ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోని పవిత్రమైన పడి మెట్లను ఎక్కగలుగుతున్నారు.
గత ఏడాది స్వామివారికి కానుకుల రూపంలో రూ.13.33 కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటి వరకు రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. వండి పెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్ లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. రద్దీ కారణంగా పంబాలోని మనప్పరం ఆన్లైన్ కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు.
పవిత్ర పంబా నదిలో దుస్తులు వదిలిపెట్టాలనేది ఆచారంలో భాగం కాదని, నదీని, కలుషితం చేయవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.