మణిపుర్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్య తరవాత వారి మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. నవంబరు 11న తొమ్మిది మంది మైతేయ్ తెగకు చెందిన వారు అపహరణకు గురయ్యారు. వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు సమీప నదిలో కొట్టుకురావడం జిరిబామ్ ప్రాంతంలో తీవ్ర హింసకు దారితీసింది.
తాజాగా మృతుల పోస్టుమార్టం నివేదిక సంచలనంగా మారింది. చిత్ర హింసలకు గురిచేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా తెలుస్తోంది. చిన్నారుల శరీరాలపై తీవ్రంగా కొట్టిన గాయాలతోపాటు వారి శరీరంపై బుల్లెట్ గాయాలను గుర్తించారు. చనిపోయిన మహిళల శరీరంలో కూడా బుల్లెట్లను గుర్తించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరవాత మరిన్ని వివరాలు అందే అవకాశముంది. మైతేయ్ తెగ వారిని పాశవికంగా చంపిన తరవాత చెలరేగిన అల్లర్లలో 11 మంది చనిపోయారు. తమపై దాడి చేసిన వారిని ఉగ్రవాదులుగా ప్రకటించాలని, అప్పటి వరకూ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని మైతేయి తెగ ప్రజలు తీవ్ర నిరసనకు దిగారు. ఎట్టకేలకు అధికారులు నచ్చజెప్పి ఆదివారం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.