బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ వద్ద ఏర్పడిన తీవ్ర అల్పపీడనం 25వ తేదీ సాయంత్రానికి వాయుగుండంగా, ఆ తరవాత తుఫానుగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. బుధవారం నాటికి ఇది తుఫానుగా మారి చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేశారు.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. మత్య్సకారులు వేటకు వెళ్లవెద్దని అధికారులు హెచ్చరించారు. జాతీయ విపత్తుల శాఖ సిబ్బందిని సిద్దం చేసింది. రైతులు పంట నూర్పిడి కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. రాబోయే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనం కదలికలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని ఐఎండి అధికారులు తెలిపారు.