ఆనందం, సుఖం, సంతోషం కోసమే మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. సుఖం కోసం అందరూ బైటి ప్రపంచం వైపు చూస్తారు కానీ అది అక్కడ దొరకదని, మానవ అంతరంగంలోనే దొరుకుతుందన్నారు. అంతరంగ మథనంలోనే అసలైన సత్యం దొరుకుతుందన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో లోకమంథన్ భాగ్యనగర్ 2024 ముగింపు కార్యక్రమంలో మోహన్ భాగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లోకం, సృష్టి, ధర్మం ఈ మూడూ కలిసే నడుస్తాయన్నారు. అవి సనాతనమని, ఆ మూడూ కలిసుంటేనే అస్తిత్వం కొనసాగుతుందని వివరించారు. జీవుల సృష్టి, స్థితి, లయం అన్నీ ఆ మూడింటితోనే వుంటాయన్నారు. ఈ సత్యాన్ని మన పూర్వీకులు శోధించారని, ఇతర ప్రపంచం శోధించలేదని తేల్చి చెప్పారు.
లోకం, సృష్టి, ధర్మం అనే పునాదుల మీదనే భారతదేశం పుట్టిందని మోహన్ భాగవత్ వివరించారు. చరిత్ర కన్ను తెరిచినప్పటి నుంచి కూడా ఆ ప్రయాణమే కనిపిస్తుందన్నారు. దానికి అనుగుణంగా మన పూర్వీకులు ఆలోచించి, జీవనం సాగించిన పద్ధతి శాశ్వతమైనదన్నారు. సమాజం బైటకు ఎంత మారినా… ఆంతరంగికంగా మాత్రం అలాంటి జీవనమే ఇప్పుడూ కనిపిస్తుందని తెలిపారు. అలాంటి జీవనయానం ప్రపంచంలో మరెక్కడా దొరకదని, కేవలం భారత్‌లోనే దొరుకుతుందన్నారు. ఎందుకంటే ఈ తత్వాన్ని అందరికీ పంచడం తమ కర్తవ్యంగా ఋషులు భావించారన్నారు. దానికి ఉపకరణంగా ఓ దేశం కావాలని భావించారని, అదే భారతదేశమని వెల్లడించారు. మన భారతదేశం సనాతనమని గుర్తుచేసారు.
ఋషులు అడవుల్లో వుంటూ వ్యవసాయం కూడా చేసేవారని, అప్పటినుంచే మన శాస్త్ర పరిజ్ఞానం, ప్రపంచమంతా వ్యాపించిందన్నారు. మన భారత భూమిలో పూర్వకాలం నుంచి అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా, ధనవంతుడైనా, నిత్య దరిద్రుడైనా, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ ఇంట్లో పుట్టాడు అన్న భేదం లేకుండా మన ఋషులకు తెలిసిన పరమసత్యాలన్నీ వారందరికీ తెలుసునని విశదీకరించారు. ఆ సత్యాన్ని కొందరు సాక్షాత్కారం చేసుకున్నారు, అనుభవంలోకి తెచ్చుకున్నారు, మరికొందరు తెచ్చుకోలేదన్నారు. అంతే తప్ప.. విషయ పరిజ్ఞానం మాత్రం అందరికీ తెలుసని వివరించారు. ఆ విషయ పరిజ్ఞానాన్ని అందరూ అనుభూతిలోకి తెచ్చుకోలేకపోయినా.. ఆ సంస్కారం మాత్రం అందరిలోనూ వుందని మోహన్ భాగవత్ గుర్తు చేసారు. ఒకప్పుడు అటవీ సంపద, అడవిపై హక్కులన్నీ గిరిజనులకే వుండేవని, ఆంగ్లేయుల పాలన వచ్చిన తర్వాత ఈ హక్కులన్నింటినీ లాగేసుకున్నారని వివరించారు. ఆ క్రమంలోనే ఆంగ్లేయులు మన సంస్కృతిని కూడా ధ్వంసం చేశారన్నారు. ఆంగ్లేయులు కుటిల బుద్ధితో భారతీయమైన ప్రతీదాన్నీ ధ్వంసం చేశారని, అయితే.. కేవలం పరాయి పాలన వల్ల మాత్రమే అలా జరగలేదని వివరించారు. మనం అధఃపాతాళానికి దిగజారిపోయామని, మన పూర్వీకులు అద్భుతమైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీవనాన్ని సాగించినా… మనం ఆత్మ విస్మృతికి లోనయ్యామనీ చెప్పుకొచ్చారు.
భారతీయ సమాజం రానూ రానూ దిగజారిపోతోందని, ప్రజలు పరస్పర సంబంధ బాంధవ్యాలను మరచి పోతున్నారని సర్‌సంఘచాలక్ ఆవేదన వ్యక్తం చేసారు. మన పూర్వజులు మనకు అద్భుతమైన జీవిత విధానాన్ని ఇచ్చారని, ఆధ్యాత్మిక మూలాల ఆధారంగా భౌతిక జీవనాన్ని ఎలా గడపాలో వివరించారనీ, కానీ ఆ మార్గాన్ని మనం విస్మరించామన్నారు. సృష్టి అంతా ధర్మం ప్రకారమే నడుస్తుందని, మన దగ్గరున్న దాన్ని త్యజించి ధర్మాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. ఆ విషయంలో శిబి చక్రవర్తి నుంచి ప్రేరణ పొందాలన్నారు. సృష్టి ధర్మాన్ని అర్థం చేసుకొని, అందరూ తమ జీవనాన్ని సాగించాలని సూచించారు. భారతీయుల ఆత్మవిస్మృతి వల్లనే సమాజంలో సంబంధ బాంధవ్యాలు ధ్వంసమయ్యాయని, స్వార్థ భావనలు పెరిగిపోయాయని అన్నారు.
భారతీయులం అందరమూ ఒక్కటే అని అర్థమైతే అలాంటి భేదభావాలు సమసిపోతాయని మోహన్ భాగవత్ వివరించారు. వనవాసీ, గిరివాసీ, గ్రామవాసి… ఎవరైనా మనమందరమూ భారత వాసులమేనని ప్రకటించారు. అది కేవలం భావన మాత్రమే కాదని, అది పరిపూర్ణ సత్యమనీ స్పష్టం చేసారు. అలాంటి సంపూర్ణ దృష్టే మన భారత దృష్టి అని వివరించారు. ఈ దృష్టి కోణం ఇతర దేశాల దగ్గర లేదన్నారు. ఆంతరిక దృష్టి అనే దృక్పథాన్ని మన పూర్వీకులు ఆచరించారని, ఇప్పుడు ఆధునికులంటున్న శాస్త్రవేత్తలు కూడా ఆ దృష్టి వద్దకే చేరుతున్నారని వివరించారు. ఇప్పటి వరకూ కణాలు, జడత్వం గురించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు చైతన్యం గురించి పరిశోధిస్తున్నారని పేర్కొన్నారు. చైతన్యం అనే అనుభూతి ఆధునికుల వద్ద లేదని, వారివద్ద కేవలం సిద్ధాంతం వుందన్నారు. భారతీయుల వద్ద మాత్రం ఈ అనుభూతి ఎప్పటి నుంచో వుందని గుర్తు చేశారు. దానిని ఏనాడో వదిలిపెట్టేసామని, ఇప్పటికైనా ఆ విస్మృతి నుంచి బైటపడాలనీ ఉద్బోధించారు. సమాజంలో ఈ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అన్నారు.
భారతీయ తత్వశాస్త్రం సైన్స్ తో సమ్మిళితమై వుంది అంటుంటారు. కానీ సైన్స్ భారతీయ తాత్విక చింతనను నమ్ముతుందా లేదా అని అడగాలన్నారు. ఆధునిక విజ్ఞానశాస్త్రం భారతీయ తత్వచింతన ఆమోదం పొందే రోజు త్వరలోనే కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ ధర్మంలో తర్కం, వివేకాలకు స్థానం వుందని, అందులో మూఢత్వం లేదన్నారు. అలాగే నమ్మకమూ లేదని, దేన్నయినా శోధించి, పరీక్షించాకే ఆ నమ్మకాన్ని స్వీకరించడం భారతీయ పద్ధతి అని గుర్తు చేసారు. రామకృష్ణ పరమహంసను వివేకానందుడు నేరుగా మీరు దేవుణ్ణి చూశారా? అని అడిగారని… అలా అడిగేవారే వివేకానందులుగా తయారవుతారనీ అన్నారు. దానికి తపస్సు అవసరమని, తపస్సు చేయాలని సూచించారు.
భారతదేశంలో ధర్మం విజ్ఞానభరితమైనది. మరి ఆధునిక విజ్ఞానం ప్రాచీన ధర్మ సమ్మతమా కాదా అని ఆలోచించాలన్నారు. దానికోసం మూలాలలోకి వెళ్లి, అధ్యయనం చేయాలన్నారు. ప్రపంచమంతా ఒకచోట ఆగిపోయిందని, కానీ మనం శాశ్వత అభివృద్ధి వైపు అడుగులు వెయ్యాలని సూచించారు. ఆ క్రమంలో విదేశాల నుంచి ప్రశ్నలు వస్తూనే వుంటాయని, వాటికి సమాధానిమిస్తూపోతే హద్దే వుండదన్నారు. ఈ తాత్విక ప్రపంచంలో భారత్ విజయం సాధించిందన్నారు. కొందరు ఓటమిని అంగీకరించక… వాదనలు చేస్తుంటారని విమర్శించారు. ఇవి రాజకీయ క్షేత్రానికి మాత్రమే పరిమితమన్నారు. కానీ భారత్ విజయం సాధించిందన్నారు. ఇన్ని సంవత్సరాలలో వ్యక్తివాదం, భౌతికవాదంతో సహా వాదాలన్నీ వచ్చాయని, ప్రజలు వాటిలోనే కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వారి పరిధిలోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.
లోక్‌మంథన్ ఢిల్లీ, హైద్రాబాద్ లాంటి మహానగరాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాలలోని గ్రామాల్లో కూడా చిన్న చిన్న లోక్ మంథన్‌లు ఏర్పాటు చేయాలని మోహన్ భాగవత్ సూచించారు.
హైదరాబాద్ వేదికగా అద్భుతమైన రీతిలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముగింపు వేడుకలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, జి కిషన్ రెడ్డి, అయోధ్య పీఠాధిపతి మిథిలా చరణ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.