మసీదులో సర్వే ప్రయత్నాలను అల్లరి మూకలు అడ్డుకున్నాయి. పోలీసులకు, అల్లరి మూకలకు మధ్యర జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ సంభల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సంభల్ జామా మసీదును హరిహర దేవాలయంపై నిర్మించారంటూ ఓ న్యాయవాది వేసిన కేసు మేరకు సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం సర్వే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సర్వే బృందం, పోలీసులపైకి వందలాది మంది రాళ్లు విసిరారు. వాహనాలు తగులబెట్టారు. పోలీసులపైకి కాల్పులు జరిపారు.
ఈ అల్లర్లలో 20 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అల్లర్లు అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీ ఛార్జి చేశారు. సంభల్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
ప్రస్తుతానికి సంభల్ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. సర్వేకు సహకరించాలని కోరారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు రాళ్లు రువ్వాయని, కాల్పులకు తెగబడ్డారని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా 20 మందిని గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. రాళ్లు రువ్విన వారిలో ఓ మహిళను కూడా పోలీసులు గుర్తించారు.