పట్టణీకరణ కారణంగా పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకంగా తయారైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నగరాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదన్నారు. మన్ కీ బాత్ 116వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ, పిచ్చుకలు జీవవైవిద్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. పిచ్చుకల జాతి అంతరించిపోకుండా చూడాల్సిన అవసరం చాలా ఉందని సూచించారు.
ఈ తరం పిల్లల్లో చాలా మందికి పిచ్చుకల పిల్లలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదన్నారు. కేవలం ఫొటోల్లో, వీడియోల్లో వాటిని చూపించాల్సి వస్తోందని అన్నారు. పిచ్చుకలను పిల్లలు ప్రత్యక్షంగా చూసే రోజు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తే అది సాధ్యమే అన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కుడుగల్ ట్రస్ట్ పిచ్చుకల జనాభా పెంపు కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. స్కూల్ పిల్లలను భాగస్వాములు చేయడం అభినందనీయమన్నారు.
పిచ్చుక గూళ్లను నిర్మించేలా కుడుగల్ ట్రస్ట్ సిబ్బంది శిక్షణ ఇవ్వడంతో పాటు ఆహారాన్ని కూడా అందుబాటులో ఉంచేలా తర్ఫీదు ఇస్తున్నారని ప్రధాని తెలిపారు.