విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు భారత రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. డిసెంబరు 27లోగా టెండర్లు దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం 53 ఎకరాలు రైల్వేకు బదిలీ చేసింది. మొత్తం 11 అంతస్తుల్లో రూ.149 కోట్లతో భవనాలు నిర్మించనున్నారు. వచ్చే రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని టెండర్లలో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఈ నెల 29న రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. నక్కపల్లి సమీపంలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే బహిరంగసభలో మోదీ పాల్గొంటారు.
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమిని రైల్వేకు అప్పగించారు. రైల్వే అధికారులు తాజాగా టెండర్లు పిలిచారు. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి.