ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఈ నెల 29న విశాఖలో పర్యటించి ఏయూలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. విశాఖ నుంచే వర్చువల్ విధానంలో అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సింహాద్రి ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న హైడ్రో ప్రాజెక్టుకు, పాయకరావుపేటలో ఫార్మా ఎస్ఈజెడ్లో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధాని రాక సందర్భంగా ఏయూలో జరగాల్సిన బీఈ–బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్ విశాఖకు వెళ్ళనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.
పూడిమడకలో రూ.85 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. 2032 నాటికి ఈ ప్లాంట్ నుంచి 60 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.