ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలంలోని తిమ్మంపేటలోని అరటితోటలో పనికి ఆటోలో బయలుదేరారు.
తలగాసిపల్లె సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం మధ్యాహం వేగంగా వచ్చిన ధర్మవరం డిపో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. జాతీయ రహదారిపై వేగ నిరోధకాలు ఉన్నా ఆర్టీసీ డ్రైవర్ బస్సును వేగంగా నడిపినట్లు గుర్తించారు. ఆటోలో కూడా పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించారని పోలీసు అధికారులు తెలిపారు. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.